ALL CATEGORIES

ఆందోళనని భూతద్దం లోంచి చూస్తే భయం అవుతుంది. అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాదికాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయా భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ఉన్నవి కసీ, పట్టుదల. కాళ్ళలోనూ కనబడుతుంది. అయినా అతడినుంచి దూరంగా పరుగెత్తలేకపోతోంది. అతడు క్రమక్రమంగా దగ్గరవుతున్నాడు. అతన్నించి ఎలాగయినా రక్షించుకోవాలన్నదే ఆమె ప్రయత్నం. తనని కాదు, తన కొడుకుని. అంకిత్‌ ఎనిమిదేళ్ళ కుర్రాడు. 'ఇలాంటి కొడుకు తమకుంటే బాగుండును' అని ప్రతి తల్లీదండ్రీ అనుకునే లాంటి అందమైన చురుకైన కుర్రాడు. అటువంటి కుర్రాడికి ఒక సమస్య వచ్చింది. మొదట్లో అది చాలా చిన్న సమస్య అనుకున్నాడు అతడి తండ్రి. కానీ చూస్తుండగానే అది పర్వతంలా పెరిగిపోయింది. ఉప్పెనలా కబళించి వేయటానికి ముందుకు దూకింది. అతడినీ అతడి తండ్రినీ రక్షించగలిగేది ఆ పరిస్థితుల్లో ఒక్కరే. అంకిత్‌ తల్లికి తాళి కట్టిన భర్త! తండ్రంటే ఎలా వుండాలి ? కొడుకంటే ఎలా వుండాలి ? కుటుంబమంటే ఎలా వుండాలి ? దిగజారిపోతున్న బాంధవ్యాల బంధాన్ని సున్నితపు సెంటిమెంటు తీవెల్తో బంధించి. అనురాగశృతుల్ని మ్రోగించిన నవల 'అంకితం'. సెంటిమెంటు,  ఆర్ధ్రత, సస్పెన్సుల మేళవింపుల సంచలన రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ సంతకం 'అంకితం'.