ALL CATEGORIES

భార్గవ చప్పున అతడిని ఆపుచేసి ''అసలేమయింది. చెప్తారా లేదా ?'' అన్నాడు ఇరిటేషన్‌ నిండిన గొంతుతో. ''వెల్‌....'' అన్నారు డాక్టర్‌. ''విల్‌ యు ప్లీజ్‌ సిట్‌డౌన్‌'' భార్గవ కోపంతో ''విల్‌ యు ప్లీజ్‌ టెల్‌ మి'' అని అరిచాడు. అన్నాజీరావు అతడివైపు తలెత్తి చూసేడు. డాక్టరుగా పుట్టం మనిషి చేసుకున్న దురదృష్టం . తప్పదు. అతడి పెదాలు స్పష్టంగా కదిలాయి. ''భార్గవా .'' అన్నాడు, ''ప్రార్ధనకి లుకేమియా''. రాబిన్‌కుక్‌ 'ఫీవర్‌' ప్రేరణతో వ్రాయబడిన నవల 'ప్రార్ధన'. కరుణరసం ఆసాంతం పోషించబడిన నవల యిది. మానవాళికి పెనుభూతంగా దాపురించిన క్యాన్సర్‌ వ్యాధిని గురించీ, దాని నివారణ కోసం జరుగుతున్న ప్రయత్నాలని గురించీ, పచ్చి వ్యాపారంగా పరిణమించిన దాని చికిత్సలని గురించీ, మందులని గురించీ చర్చిస్తారు రచయిత. ఒక చోట నవలలో భార్గవ పాత్ర ఇట్లా అంటుంది.... ''ఈ ప్రపంచంలో ఎక్కడా క్యాన్సర్‌కి పూర్తిగా మందు కనుక్కోబడదు. ఎందుకో తెలుసా! శేఖరం!, కేన్సర్‌ చాలా పెద్ద బిజినెస్‌. డబ్బున్న వాళ్ళకి వచ్చేది. అది చాలా ఖరీదైన వ్యాధిగా వుండిపోవల్సిందే. కేన్సర్‌ని నాశనం చేయటానికి ఒక చౌకైన మందు గానీ మూలిక గానీ కనుక్కోబడిన మరుక్షణం అమెరికాలో కోట్ల కోట్ల రూపాయల్తో స్థాపించబడ్డ రీసెర్చి ఇన్స్టిట్యూట్‌లు మూతబడతాయి. ఎందరో క్యాన్సర్‌ స్పెషలిస్టులు వీధిన పడతారు. మొత్తం ఆర్ధిక వ్యవస్థే దెబ్బతింటుంది. అందుకే ఎంత ఖర్చయినా అసలు మందు కనుక్కోకుండా నొక్కెయ్యాటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికీ తెలియని సత్యం ఇది ! నేను దాన్ని బయటపెడితే నాకు పిచ్చెక్కిందంటారు''.. యండమూరి వీరేంద్రనాథ్‌ బాణీ సస్పెన్సుతో - ఆర్ద్రమైన మానవ సంబంధాల చిత్రీకరణతో - విశిష్టమైన పాత్ర పోషణతో సాగిపోయే నవల.