ALL CATEGORIES

అంగుళంలో మూడువందలో వంతు మాత్రమే వున్న అతడు - చిన్న తల, పెద్దతోక వేసుకుని, చేప ఎదురీదినట్టు ప్రవాహానికి కొన్ని వేలమైళ్ళు ఎదురీదుతూ, ఎదురొచ్చే ద్రవాలతో పోరాడి తన ఉనికిని నిలుపుకుంటూ ఆమెను చేరుకున్నాడు. జైగోట్‌! ఒక శుక్లకణ,ం ఒక బీజాన్ని వలయంలా చుట్టుముట్టి ఇరవైమూడుని ఇరవైమూడు జతలు చేసే సమయాన - అదే సమయాన - ఆగర్భంలో నిక్లిప్తం అవటం కోసం - సుషుప్తిలోంచి నెమ్మదిగా కనులు విప్పింది. కాష్మోరా!!! ఆ పిండానికే ప్రాణం వస్తే-తొమ్మిది నెలల తరువాత పుడతాడు - ప్రపంచాన్ని ఏలటానికి, బీభత్సం సృష్టించటానికి, కాష్మోరా అంశగల అష్టావక్ర. దట్టంగా పేరుకున్న ఎండుటాకుల క్రింద నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎవరో నిద్రలేచి బద్ధకంగా నిట్టూర్చిన వేళ! ఆనందనృత్య హేల!! చీకటి ప్రపంచపు గణాధిపతుల కాష్మోరా అంశతో ప్రపంచాన్ని ఏలటానికి వస్తున్నాడు 'అష్టావక్ర'. అతడి ఆగమనానికి సూచనగా అప్పుడే ఏడుగురు వికృత శిశువులు ఆ గ్రామంలో జన్మించారు. దేశం దృష్టి యావత్తూ ఆగ్రామం మీద పడింది. ఎనిమిదోనాడు కేదారి గర్భాన ప్రవేశించాడు. అతడి పుట్టుకని ఎవరాపగలరు ? కొన్ని వేల సంవత్సరాల క్రితం శిశువు జన్మించగానే శరీరం అంతా ఉప్పుజల్లి బ్యాండేజీతో కట్టేసేవారట. ఇంత అనాగరికమైన పరిస్థితి నుంచి ఎదిగాడు మనిషి. మ్యుటేషన్స్‌ రహస్యాన్ని శోధించాడు. క్లోనింగ్‌ ప్రయోగాల్లో విజయం సాధించాడు. కానీ ఇదంతా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది ? సామాన్యులు కలలో కూడా వూహించని చోటుకి రచయిత మిమ్మల్ని తీసుకువెళ్తాడు. మనిషి పుట్టుకలో వస్తున్న పరిణామాల భూత, భవిష్యత్‌ వర్తమానాల సైన్సు-సస్పెన్సుల మరోకలయిక శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ కలంలోంచి జారిన 'అష్టావక్ర' నవల.