ALL CATEGORIES

హిందూదేశంలోని దక్షిణ భాగంలో రాజకీయ వాతావరణంలో అనూహ్యమైన మార్పులకు క్రీ.శ. 1336లో నాంది ఏర్పడింది. ఆ సంవత్సరమే ప్రాచీన దక్షిణ హిందూ దేశ చరిత్ర అంతం కావడం, ఆధునిక చరిత్రకు అంకురార్పణ ఏర్పడడం జరిగాయి.

అయితే ఈ మార్పుకి ముందు హిందూ దేశమంతా ముక్కులు - ముక్కలుగా వివిధ హిందూ రాజుల ఆధీనంలో వుంది. వారిలో మధురని పాలించే పాండ్యులు, తంజావూరుని పాలించే చోళ ప్రభువులు ముఖ్యమైన వారు. విజయనగర సామ్రాజ్యం అభివృద్ధి అయ్యేకొద్దీ పాండ్య, చోళరాజ్యాలు క్రమంగా నశించడం ప్రారంభించాయి. క్రమక్రమంగా విజయనగర రాజులు దక్కను నుంచి సింహళ ద్వీపం వరకూ గల భూభాగానికి అధిపతులయ్యారు.

మహమ్మదీయులు దక్షిణ హిందూదేశం మీద దాడి చెయ్యడానికి కృష్ణానదిని దాటేసరికి దక్షిణంలో వున్న హిందూరాజ్యాలన్నీ పేరుకి మాత్రమే ఉన్నాయి. అయినా సరే అంతా కలసి ఏకత్రాటిపై నిలచి మహమ్మదీయులను ఎదుర్కోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ సమయంలోనే విజయనగర రాజులు తురుష్క సేనావాహినులను అడ్డుకుని, సుమరు రెండు వందల యాభై సంవత్సరాల వరకూ దక్షిణాపధాన్ని కాపాడారు.

అంత గొప్ప సామ్రాజ్యం గురించి నేడు తలచుకునే వారే లేరు. విజయనగరం పేరుతో విరాజిల్లిన ఆ మహానగరం నేడు మనకు శిథిలాలతో, పడిపోయిన కోట గోడలతో, గజశాలలతో దర్శనమిస్తుంది. ఆ సామ్రాజ్యం గురించి స్పష్టమైన చరిత్ర కూడా మనకు అందుబాటులో లేకపోవడం, వున్నదాంట్లో కూడా వాస్తవాలు ఏవో, కల్పితాలు ఏవో కూడా తెలియని పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం.

పదిహేను, పదహారు శతాబ్దాలలో హిందూ దేశాన్ని సందర్శించిన పాశ్చాత్య రాయబారులు, యాత్రీకులు, విస్తీర్ణంలో గానీ, సంపదలో గాని ప్రపంచంలోనే విజయనగరానికి సరితూగగల నగరం అంటూ మరొకటి లేదని పేర్కొనడం గమనార్హం. అంత అద్భుత చరిత్ర, ప్రశస్థిగల విజయనగర వైభవం క్రీ.శ. 1565లో అంతరించిపోయింది. ఇప్పుడు శిథిలాలతో చూపరులను ఇంకా విశేషంగా ఆకట్టుకునే ఈ నగరం ఎలా ఆవిర్భవించిందీ, ఎలా పతనమయిందీ తెలుసుకునేందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది.