ALL CATEGORIES

"ఈ మాత్రానికా...అమ్మా.! నువ్వేనా ఇలా మాట్లాడేది? క్రమశిక్షణ అదీ అంటూ చెవులు మేలదీసే నువ్వు...." "అంటే నీ ఉద్దేశం ఏమిటి? క్రమశిక్షణ అంటే మిలిటరీ తరహాలో ప్రతిచిన్న విషయాన్నీ సీరియస్గా తీసుకుని దండించడం కాదు. అతి గారాబం ఎంత చెడ్డదో అతిగా దండించడం అంతకన్నా చెడు చేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు ఈ వ్యత్యాసం తెలుసుకోలేక పిల్లలు చెడిపోవడానికి తామూ కొంత కారణం అవుతున్నారు. ఆరోగ్యకరమైన అల్లరిని మనమూ తేలిగ్గా తీసుకుని వాళ్ళకి సర్ది చెప్పాలి గానీ, విసుగు, కోపం ప్రదర్శించకూడదు. మిమ్మల్ని ఎలా పెంచానో నీకు తెలియదా?" "తెలుసు. మమ్మల్నేమిటి, మా పిల్లల పెంపకం కూడా నువ్వే చూసుకుంటున్నావ్ కాబట్టి మేం నిశ్చింతగా వున్నాం. కానీ వీళ్ళలా అన్నయ్యలూ, నేనూ ఎప్పుడూ గొడవ పడలేదు. నీకేం తెలుసు వీళ్ళ అల్లరి...?" "నాకు తెలీకుండానే వీళ్ళు పెరిగారా ఏమిటి? ఎందుకంత బాధపడిపోతావ్? కాసేపు పోటీ పడి వాళ్ళే సర్దుకుపోతారు. మనం పట్టించుకోకూడదు. నీకు తెలుసో లేదో, ఓసారి చుట్టుపక్కల పిల్లల్ని గమనించు. ఆదివారం వచ్చిందంటే చేతికి దొరకరు. ఎక్కడ తిరుగుతారో, ఏం ఘనకార్యాలు వెలగబెడతారో వాళ్ళకే తెలియాలి. కానీ నీ కొడుకు, కూతురు ఆదివారం కూడా బయట వృధాగా తిరగకుండా ఇంటిపట్టునే ఉంటారు. అల్లరి చేస్తారు. చదువుకుంటారు. సంతోషించు. వాళ్ళ అల్లరితో నువ్వూ పోటీపడితే సంతోషిస్తారు. కావాలంటే చూడు. నువ్వు వెళ్ళి వాళ్ళిద్దర్నీ పక్కకు నెట్టి క్రికెట్ లేదు, సినిమా లేదు, సీరియల్ చూసేదాకా టి.వి. వదలనని చెప్పు. దెబ్బకు వాళ్ళిద్దరూ ఇక్కడకు పరిగెత్తుకొచ్చి కామ్గా టీ.వి. ముందు కూర్చోకపోతే అడుగు" అంటూ వివరించిందామె.