ALL CATEGORIES

''నువ్వు చక్కగా జాబ్‌ చేసుకుని హెపీగా వుంటే చాలు. సారీ చెప్పక్కర్లేదు. నామూలంగా సుధాకర్‌కి, నీకు చెడిపోయింది. మీ ఇద్దర్నీ కలపాలనే నా ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుందో నాకు తెలీదు. వాడికి నువ్వు నిరపరాధివని తెలిసిన సంతోషంకన్నా నువ్వు అవమానించావనే బాధే ఎక్కువగావుంది. అందుకే ఎంత చెప్పినా కన్విన్స్‌ కాలేకపోతున్నాడు.''

''వద్దు భాస్కర్‌. సుధాకర్‌ని వప్పించే ప్రయత్నం చేయకు. ఎందుకంటే మా మధ్య ఇంతకాలం వున్నది స్నేహం మాత్రమే. దాన్ని ప్రేమగా మార్చుకుని ముందుగా పెళ్ళికి ప్రపోజ్‌ చేసింది అతనే... నేను కాదు.''

''అంటే...?''

''ఏముంది. స్వార్ధం ప్రేమగా మారదు. అలా మారినా ఎక్కువ కాలం నిలవదు. మా విషయలో అక్షరాలా అదే జరిగింది. అదృష్టవశాత్తూ పెళ్ళికి ముందే నువ్వేదో చెప్తే అతగాడెలాగో రియాక్టయ్యాడు. అదే పెళ్ళియిన తర్వాత జరిగివుంటే, అప్పుడూ ఇలాగే చెప్పుడు మాటలు నమ్మి నన్ను దూరం చేసుకునేవాడు అవునా?''

''అవును. కాని, అంతదూరం ఆలోచించటం అవసరమా?''

''ఖచ్చితంగా అవసరమే. ఇక్కడ వాస్తవం ఏమంటే, అతనికి చదువుకొని, ఉద్యోగం చేస్తున్న అందమైన భార్య కావాలి. అందుకే మా స్నేహాన్ని ప్రేమ నాటకంతో నన్ను ఒప్పించి పెళ్ళి చేసుకోవాలని చూసాడు. అయితే నా యాంగిల్‌లో కూడ ఒక స్వార్ధం వుంది. అదేమంటే నావరకు నా క్షేమంకన్నా, మా కుటుంబ క్షేమం నాకు ముఖ్యం. నన్ను పెళ్ళిచేసుకునే వాడు నన్ను మాత్రం బాగా చూసుకుంటే చాలదు. అమ్మా, తమ్ముడు వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. అన్నిటికిమించి తమ్ముడు ఉద్యోగస్థుడయి సంపాదించేవరకు ఆ ఇంటికి నా సంపాదన అవసరం వుంది. దానికి అంగీకరించేవాడయి వుండాలి. నాకు పెళ్ళంటూ జరిగిపోతే మొగుడనేవాడు ఎలాంటివాడో ఏమిటో ఏం చెప్పగలం. అందుకే ఇప్పట్లో పెళ్ళిచేసుకోకూడదనుకున్నాను. సుధాకర్‌కి అదే చెప్తూ వచ్చాను. బాధ్యతలకి కట్టుబడివున్న అమ్మాయిని కాబట్టి ప్రేమ గురించి, పెళ్ళి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అటువంటి నాలో ఆశలు రేకెత్తించినవాడు సుధాకరే. నా జీతం అక్కర్లేదు అన్నాడు. మా వాళ్ళని బాగా చూసుకుంటానన్నాడు. ఓ.కె... ఇంత కాలం స్నేహంలో సుధాకర్‌ కన్నా నన్ను అర్ధంచేసుకునే మనిషి దొరకటం కష్టం. ఆపైన ఏ ఉద్యోగం స్థిరం లేకుండా పోవటంలో ఎదురుదెబ్బలకు తలొగ్గి పెళ్ళికి సరేనన్నాను. ఇంతలోనే యిలా జరిగింది. అయిందేదో అయింది. జరిగింది నా మేలుకే అనుకుంటాను. నాకోసం నువ్వు సుధాకర్‌ని ఒప్పించే ప్రయత్నం చేయకు. నన్ను ఎంగిలాకుతో పోల్చిన వ్యక్తితో జీవితం పంచుకోడానికి నేను సిద్ధంగా లేను'' అంటూ మనసులో మాటను బయటపెటేసిందామె.

ఆమె మాటలు వింటూ కారు నడుపుతున్న భాస్కర్‌ కామెంట్‌ చేయలేదు. అయితే... ఇక్కడ మరో సంఘటన జరిగింది.