ALL CATEGORIES

ఈ నవలలో కొన్ని యదార్ధ సంఘటనలూ, కొన్ని కల్పితాలూ కలిపి మిళితం చేయటం జరిగింది. షఫీ, బిన్‌లాడేన్‌ లాంటి పాత్రలు యదార్దం. సారంగపాణి, బుకారీ కల్పితం. అదే విధంగా గోకుల్‌చాట్‌, నల్ల ఎడారి మొదలైనవి యదార్ధం. అక్కడ ఎడారిలో అణుబాంబు, రిసెర్చి సెంటరు మొదలైనవి కల్పితం. ఇలా సగం ఫిక్షన్‌, సగం యదార్ధ పాత్రల చరిత్రల  మిక్స్‌తో వచ్చిన నవలలు తెలుగులో అరుదు. అదే విధంగా పెషావర్‌, పర్వత శ్రేణులు, అక్కడి గిరిజనులు మొదలైన వాటిని సహజ వాతావరణం కోసం స్వీకరించడం సంభవించింది.

అదేవిధంగా ఖాలా-ఇ-జంగ్‌ సంఘటన నిజంగానే జరిగింది. 2001 డిసెంబరులో జరిగిన ఈ మారణ హోమంలో దాదాపు 500 మంది మరణించి, మిగిలిన 86 మంది తాలిబన్లు లొంగిపోయారు. కొందరు ఆప్గన్‌, అమెరికన్‌ అధికారులు కూడా చనిపోయారు. దాదాపు మూడు రోజుల పాటు ఈ సంగ్రామం జరిగింది. మరణించిన తాలిబన్లను ఆఫ్గాన్లు లూటీ చేశారు. చివరికి శవాల నోళ్ళలో అరుదుగా ఉండే బంగారుపళ్ళను కూడా దొంగిలించారు. ఆ సంఘటనను ఈ రచనలో యధాతథంగా వాడటం జరిగింది.

ఈ రచనలో తాలిజన్ల ఫిలాసఫీ చదువుతుంటే 'వారు చెప్పేదంతా నిజమే కదా' అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. అందుకనే దాన్ని యధాతథంగా వాడుకోవటం జరిగింది. చరిత్ర పట్ల అంతగా ఉత్సాహం లేని పాఠకులకు ఈ చర్చలు కాస్త విసుగు కలిగిస్తాయి.

'రచయిత స్వేచ్ఛ' అని వుంటుంది. నమ్మశక్యం కాని అభూత కల్పనలు వ్రాయవలసి వచ్చినప్పుడు దానిని వాడతారు. ఈ రచన తాలూకు నాటకీయమైన సంఘటనల్లో దాన్ని కాస్త వాడుకోవటం జరిగింది. 'నల్ల ఎడారి నుంచి కార్గిల్‌ వరకూ ఎక్కడా ఆగకుండా హెలికాప్టర్‌ రాగలగటం, ప్రపంచానికి తెలియకుండా కాస్పియన్‌ సముద్రం పక్కన ఆల్‌-కాయిదా అణుబాంబు రిసెర్చి సెంటర్‌ స్థాపించటం'', ఇలాంటివి స్వేచ్చకు ఉదాహరణలు.

చరిత్ర అంతా పాఠకులకి ఎలా తెలుస్తుంది ? ఇదంతా ఒక పుస్తకంగా వ్రాస్తే ఎవరూ చదవరు. బోర్‌, కాబట్టి ఇలాంటి ఫిక్షన్‌ నవలల్లో ఆ చరిత్రను చొప్పిస్తే కొంతవరకయినా యువతకి దీనిపట్ల అవగాహన కలుగుతుందని రచయిత ఆశ.

'సాక్షి'లో సీరియల్‌గా వచ్చినప్పుడు పాఠకులను ఎంతగానో ఆట్టుకున్న నవల డేగ రెక్కల చప్పుడు.