ALL CATEGORIES

తెలుగు సాహిత్యపు గత వైభవాన్ని పరిశీలిస్తే మనకందులో ఎందరో మణిదీపాలవలె వెలిగినవారు కనిపిస్తారు. గురజాడ అప్పారావు, శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన లబ్ధ ప్రతిష్ఠులే కాక కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్‌, బుచ్చిబాబు లాంటి సమర్థులైన మనోవిశ్లేషకులను కూడా తెలుగుతల్లి మనకందించింది. సామాజిక దురన్యాయాలపై తిరుగుబాటు బావుటాలెత్తిన రాచకొండ, చలం మొదలైన వారు ఎటూవున్నారు. ఇక నాటకరంగాన్ని పరిశీలిస్తే మాలపల్లి, కన్యాశుల్కం నుంచి మరో మొహంజొదారో, రాగ రాగిణి, రాతి మనిషి లాంటి గొప్ప నాటకాలందించిన రచయితలూ మనకు వున్నారు. వీరు గాక, చాసో, కాళీపట్నం, పెద్దిభొట్ల వంటి అత్యుత్తమ కథకులూ బాలగంగాధర తిలక్‌, జంధ్యాల పాపయ్య శాస్త్రి, బసవరాజు అప్పారావు లాంటి భావుకులయిన కవులూ తెలుగు సాహితీ పీఠానికి ముత్యాలు అద్దేరు. వేర్వేరు రంగాలలో అత్యున్నత స్థాయి సంపాదించిన మహా రచయితల సరసన యండమూరి వీరేంద్రనాథ్‌ని నిలబెట్టే సాహసం మేము చేయము గాని, ఆయనకి కథ, నవల, నాటకం, కవిత్వం, సినిమా కథా, మాటల రచన ఈ రంగాల్లో ప్రవేశమూ, తగు మాత్రపు ఖ్యాతీ ఉన్న సంగతీ మరువలేము. శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ గత 35 సంవత్సరాల సాహితీ జీవనంలో జీవితం పట్ల, సమాజం సట్ల, మనిషి ప్రవర్తన పట్ల తన రచనల్లో వెలువరించిన భావాలనూ, పరాకాష్ఠగా భావించదగిన ఆణిముత్యాల్నీ ఏరికూర్చి మనకందిస్తున్నారు ప్రచురణకర్తలు. విభిన్నమైన రీతుల్లో, ఇన్ని ప్రక్రియల్లో చేపట్టిన ఒకే రచయిత రచనలోని విలువైన మాటలన్నీ ఒక పుస్తక రూపంలో రావటం తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదలు.