ALL CATEGORIES

వ్యక్తుల్ని ప్రేమించేకొద్దీ, వారి నుంచి దూరమైతే విరహం, వారికి కోపం వస్తే బాధ. వారు వేరే వారిపట్ల కాస్త ఎక్కువ శ్రద్ద చూపితే ఈర్ష్య! అదే ప్రాణంలేని సంగీతం, పెయింటింగ్‌, రచన, పఠనం మొదలైన వాటి పట్ల అభిరుచి పెంచుకుంటే మనకి మనమే వాటితో రమించవచ్చు. అవి అలగవు, కోరికలు తీర్చమని బలవంతపెట్టవు. మరికొంత సమయం తమకోసం కేటాయించమని అడగవు. అందుకే ప్రకృతితో స్నేహం ఎల్లప్పుడూ నిరపాయకరం. సామాన్యుడు ఎవరేం చెప్పినా నమ్ముతాడు. ఎలా ? ఎందుకు? అని ఆలోచించడు. హేతువు వున్నదాలేదా ? ఇదెలా జరుగుతుంది ? అని తెలివైనవాడు తర్కిస్తాడు. తనకి తెలియని హేతువు కూడా వుండొచ్చుకదా, కారణం వున్నదే కరెక్టనుకోవటం దేనికి ? అని మేధావి ఆలోచిస్తాడు. హేతువు కన్నా, తనకిగానీ, ప్రపంచానికి గాని ఆ పనివల్ల వచ్చే 'ఉపయోగం' గురించి జ్ఞాని ఎక్కువ పరిశీలిస్తాడు. మనిషి ఎలా సంతృప్తిగా బ్రతకాలో చెప్పేదారిలో, ఒక మైలురాయి లాంటి వాడు భగవంతుడు. కర్తవ్య నిర్వహణ మానేసి కేవలం అతణ్ణి పూజించేవాడు, ప్రయాణం మానేసి 'మైలురాయి'ని పూజిస్తున్నవాడి కింద లెక్క. ఈ ప్రపంచంలో మోసగాళ్ళందరూ ఎప్పుడూ రకరకాల అబద్ధాలు ఆడుతూ వుంటారనీ, అందమైన కట్టుకథలు విపరీతంగా చెప్పేస్తూ వుంటారనీ, మామూలు మనుషుల కన్నా వాళ్ళు చాలా డిఫరెంట్‌గా వుంటారని మనమనుకుంటే అది చాలా తప్పు. వాళ్లూ మనలాగే ఉంటారు. వారి సిన్సియారిటీని హానెస్టీగా ఎప్పుడూ భావించకూడదు. సిన్సియారిటీ అంటే శ్రద్ధ. హానెస్టీ అంటే నిజాయితీ. అతడు చాలా సిన్సియర్‌ అనటానికీ, అతడు చాలా హానెస్ట్‌ అనడానికీ చాలా తేడా ఉంది. నమ్మకద్రోహులే ఒక్కోసారి చాలా శ్రద్దగా వుంటారు. మనో వైజ్ఞానిక సాహిత్యంలో అపూర్వ సంచలనాలను సృష్టిస్తున్న  వ్యక్తిత్వ పుస్తకాలు - తప్పుచేద్దాంరండి, విజయానికి ఆరోమెట్టు, మైండ్‌ పవర్‌ నెంబర్‌ 1 అవటం ఎలా, విజయంలో భాగస్వామ్యం, విజయానికి అయిదుమెట్లు-గెలుపుకోసం ప్రతి వ్యక్తి ఆచరించవలసిన సూత్రాల్ని పై పుస్తకాల్నుంచి క్లుప్తీకరించి పాఠకుల సౌలభ్యం కోసం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తున్న విజయ రహస్యాల సంకలనం 'మంచుపూల వర్షం'.