ALL CATEGORIES

ఆంద్ర మహాభాగవతం పదవ స్కంధం పూర్వభాగంలోని శ్రీకృష్ణుని చరిత్ర ఆధారంగా రచింపబడిన నిర్వచనకావ్యం "నందనందనోపాఖ్యానం". ఈ కావ్య రచయిత సుప్రసిద్ధ విద్వత్కవుల వంశానికి చెందిన శ్రీయుత ఆలూరు కృష్ణమూర్తిగారు. శ్రీకృష్ణుని పుట్టుక మొదలుకొని, కృష్ణుని ఆదేశాన్ని అనుసరించి అక్రూరుడు హస్తినాపురికి వెళ్ళేంత వరకు జరిగిన కథాంశాలు ఈ కావ్యంలో 3129 కంద పద్యాల్లో నెలకొల్పబడివున్నాయి. ఈ విధంగా నందనందనుని చరిత్రను పూనికతో ఒకే ఛందంలో ఇమిడ్చి రచించటం ద్వారా ఈ రచయిత కృతకృతయుడయినాడు.

          "భాగవతము తెలిసి పలుకుట కల్ల, శూలికైన తమ్మిచూలికైన" అన్నారు పోతన. భగవంతుని అవతారములు అనంతాలు, లీలలు కూడా అనంతాలే. ఎటొచ్చీ మానవుని ప్రజ్ఞ పరిమితమే కనుక ఆలీలా మానుష విగ్రహుని తత్త్వమును గ్రహించడం యోగులకు కూడా అసాధ్యమగుచుండగా సామాన్యుల కథ చెప్పనేల? విష్ణువు సర్వవ్యాపకుడు. భక్తుల హృదయాంతరాళాలలో ఉంది భక్తకవులచేత తన కథను తానే వ్రాయిస్తూ ఉంటాడు. పాఠకుడు కూడా భాక్తుడైతే ఆ కావ్యం కర్ణరసాయనంగా ఉంటుంది. ఆ కోవకు చెందినదే ఆలూరు కృష్ణమూర్తిగారి నందనందనోపాఖ్యానము.