ALL CATEGORIES

 విద్య (ఎడ్యుకేషన్‌), మనో విజ్ఞానశాస్త్రం (సైకాలజీ) ఈ రెండింటికీ విడదీయరాని సంబంధమున్నది. ఇవి రెండూ విడిగా కాకుండా ఒకదానిలో ఒకటి అంతర్భాగం అయితేనే బోధనకు సార్ధకత. అప్పుడే బోధన అనేది అధ్యయనం అవుతుంది. (టీచింగ్‌ బికమ్స్‌ లెర్నింగ్‌). ఈ పుస్తక రచచయిత శ్రీ దేశినేని వేంకటేశ్వరరావు గారు ఉపాధ్యాయుడిగా పుట్టి మనోవిజ్ఞాన శాస్త్రంలో పెరగడం వలన ఈ పుస్తకానికి కళ (బ్యూటీ) వచ్చింది. రెండు పాయలు కలిసి అందమైన జడగా రూపుదాల్చినట్లు రచయితలోని బోధన (టీచింగ్‌) మనో విజ్ఞానశాస్త్రం (సైకాలజీ) రెండూ సంయోగం చెందటం వల్ల ఈ పుస్తక స్వరూపం వచ్చింది. చదువనేది, నేర్చుకోవడమనేది కేవలం ఉపాద్యాయుడు, విద్యార్ధి అనే ఇద్దరి మధ్య మాత్రమే జరిగే ప్రక్రియ కాదు. ఇందులో తల్లిదండ్రులు, పరిసరాలు, సమాజం.. ఇలా ఎంతోమంది పాత్రధారులున్నారు. పిల్లలు సంతోషంతో చదువుల్లో రాణించాలంటే వీరందరూ తమ, తమ పాత్రలను సమర్ధవంతంగా ఎలా నిర్వహించాలో ఈ పుస్తకం అద్దం పడుతున్నది. అందుకే ఈ పుస్తకం కేవలం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకే కాదు, విద్యారంగంతో సంబంధం గల ప్రతి ఒక్కరికీ ఒక మార్గదర్శి (గైడ్‌) లాంటిది. ఉపాధ్యాయుడు ఎంతో బోధించినా, పిల్లలు అసలేమి నేర్చుకోక పోవచ్చు! ఉపాధ్యాయుడు ఏమి బోధించక పోయినా పిలలలు అనేక విషయాలు నేర్చుకోవచ్చు! అంటే బోధన (టీచింగ్‌) ఉన్నప్పటికీ అభ్యసనం (లెర్నింగ్‌) లేకపోవచ్చు. ఏ బోధన లేకుండా కూడా అభ్యసనం జరగవచ్చు. బోధన - అభ్యసనం అనే రెండింటినీ సమన్వయ పరిచేది, వాటి మధ్య బంధాన్ని పటిష్ఠం - చేసేది మనోవిజ్ఞానశాస్త్రం. ఒకరు ఉపాధ్యాయుడుగా ఎదగాలంటే మొదట తాను అభ్యాసకుడు (లెర్నర్‌) కావాలి. ఈ పుస్తకం ఉపాధ్యాయుడిని అభ్యాసకుడిగా మారుస్తుంది. నేర్చుకోవటమంటే ఎలా జరుగుతుందో తెలిసినప్పుడే ఉపాధ్యాయుడు తన విద్యార్ధులలో పరకాయ ప్రవేశం చేయగలడు. అలా చేసినపుడే విద్యార్ధిలో జ్ఞానకాంక్షను రగిలించగలడు. వారిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్ధ్యాలను బయటకు తీయగలడు. అందుకే ఈ పుస్తకం బోధనాభ్యాసన ప్రక్రియకు మార్గదర్శిలాంటింది.