ALL CATEGORIES

సమస్య రాగానే మనం పరిష్కారం ఆలోచించటం మానేసి, విచారించటం ప్రారంభిస్తాం. సముద్రం ఎంత పెద్దదైనా, నీళ్ళని లోపలికి రానివ్వకపోతే పడవ మునగదు. సమస్య ఎంత పెద్దదైనా, మనసులోకి రానివ్వకపోతే బాధ ఉండదు. పాతికశాతం సమస్యలు పరిష్కారం లేనివి. పరిష్కారం లేని ఈ పాతిక శాతం గురించీ మనం జీవితంలో సగవంతు కాలం ఆలోచిస్తూ గడిపేస్తాం. ఇంకో యాభై శాతం సమస్యలు మనకి ఇతరుల వల్ల వచ్చేవి. అవి తీరాలంటే మారవలిసింది  వాళ్ళు. మనం కాదు. తాగుబోతు భర్త, దుబారా భార్య, గయ్యాళి అత్తగారు, చెడుదార్లో సంతానం వగైరా. వాళ్ళని మార్చటం ఎలా అని నిరర్ధకంగా విచారిస్తూ మరో పాతిక శాతం కాలం గడిపేస్తాం. మిగిలిన పాతిక శాతం సమస్యల్నుంచి బయటపడాలంటే కఠినమైన నిర్ణయాలు అమలు జరపాలి. దురదృష్టవశాత్తూ ఇటువంటి సందర్భాల్లో మనం ఆలోచిస్తూ కూర్చుంటాము తప్ప నిర్ణయాలు తీసుకోము. తీసుకున్నా, అమలు జరపం. ఏ సమస్యకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే సమస్య తాలూకూ సాంద్రత తగ్గుతుందో ఆత్మీయంగా చెప్పే పుస్తకం "సమస్యలూ - పరిష్కారాలు". పేజీలు : 183