ALL CATEGORIES

అష్టాదశ పురాణాలలో పదవది బ్రహ్మవైవర్త మహాపురాణం. ''బ్రహ్మవైవర్త సంజ్ఞంతు నామోజానురుదాహృత:'' అన్నమాటను బట్టి శ్రీమహావిష్ణువు జానువుగా ఈ పురాణం చెప్పబడింది. ''సావర్ణినా నారదాయ కృష్ణమహాత్మ్య ముత్తమమ్‌| బ్రహ్మరూపవరాహస్య చరితం వర్ణ్యతే మహు:||'' అన్న శ్లోకం ప్రకారం సావల్గిమనువు వరాహస్వామి, శ్రీకృష్ణుడికి సంబంధించిన విశేషాలను నారదమహర్షికి తెలియచేసిందే ఈ బ్రహ్మవైవర్త పురాణం అని తెలుస్తోంది. ''సారభూతం పురాణేషు బ్రహ్మవైవర్తముచ్యతే'' అష్టాదశ పురాణాల సారమే ఈ పురాణం అని దీని గొప్పతనం ఘనంగా చెప్పబడింది. ఇందులో మొత్తం 18000 శ్లోకాలున్నాయి. ఇది నాలుగు ఖండాలుగా విభాగించబడింది. 1.బ్రహ్మఖండం 2. ప్రకృతిఖండం 3.గణేశ ఖండం 4. శ్రీకృష్ణజన్మ ఖండం అని ఇందులో శ్రీకృష్ణ జన్మ ఖండం తిరిగి పూర్వార్ధం, ఉత్తరార్ధం అని రెండు విభాగాలతో వుంటుంది.