ALL CATEGORIES

'ముగ్గు మధ్యలో కాద్రా కూర్చుని ఉన్నాడు. అతడి ప్రక్కన పాత్రలో మైదాపిండి ఉంది. తులసి చేతి కర్చీఫ్‌ ఉంది. తులసి తొక్కిన కాలిమట్టి ఉంది. ముగ్గుకి ఎనిమిది వైపులా చిన్న చిన్న గొబ్బిళ్ళలాంటి మాంసపు ముద్దలు ఉన్నాయి..... ముగ్గు మధ్యలో హ్రీం-క్రీం అన్న అక్షరాలు వ్రాయబడి ఉన్నాయి. సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకొని వుంది. అతడు మైదాపిండితో బొమ్మను తయారు చేశాడు. తులసి తాలూకు చేతి గుడ్డ దానికి కట్టేడు. తులసి తొక్కిన మట్టిని ఆ బొమ్మ కాలికి అద్దేడు. బొమ్మ నెదురుగా పెట్టుకొని మంత్రం చదవటం మొదలుపెట్టాడు. అతడి పెదవులు కదులుతున్నాయి....'' తులసి అనే పదేళ్ళ చిన్నారిని చంపటానికి ముగ్గురు కిరాతకులు కాద్రా అనే మహామాంత్రికుడిని ఆశ్రయించారు. 'కాష్మోరా' అనే అతిభయంకరమైన క్షుద్రదేవతను ప్రయోగించి 21 రోజుల్లో పాపని చంపుతానని వాగ్దానం చేశాడు కాద్రా. రోజు రోజుకి తులసి క్షీణించిపోసాగింది. ఒక హిప్నటిస్టు, ఒక డాక్టరు కలసి ఆ చిన్నారిని కాపాడటానికి రంగంలో దిగారు. 1981లో వెలువడిన ఈ నవల - తెలుగు పాపులర్‌ నవలా సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పింది. సంచలనం సృష్టించింది. అనేక వాద వివాదాలకు కేంద్రబిందువయింది. అఖిలాంధ్ర పాఠకలోకాన్ని అలరించిన ఈ నవల ఇప్పటికీ బెస్ట్‌ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది.